అమరావతి : ఏపీలోని అనకాపల్లి(Anakapalli) జిల్లాలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి( Reactor Blast) ఇద్దరు మృతి చెందగా మరో 18 మందికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఘటనతో పెను ప్రమాదం తప్పింది. అచ్యుతాపురం సెజ్(Sez) లోని ఎసెన్సియా కంపెనీలో అకస్మత్తుగా రియాక్టర్ పేలింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న 18 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
మరికొంత మంది మధాహ్నభోజన సమయంలో భోజనం చేసేందుకు బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం హుటాహుటిన బాధితులను అనకాపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. హారిక అనే కార్మికురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. మరో కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.