అమరావతి : ఏపీలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో బ్రమ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం వేణుగానాలంకారంలో రామయ్య నాలుగు మాఢవీధుల్లో భక్తులను కటాక్షించారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి హంసవాహనంపై స్వామివారు విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.