తిరుపతి : తిరుపతి(Tirupati)లోని శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. ఫిబ్రవరి 14 నుంచి 22వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం(Puspayagam) నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని వారు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి(Venkateshwara swamy) వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3.5 టన్నుల పుష్పాలతో పుష్పయాగం చేశారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు పులకించారు.
తమిళనాడు(Tamilnadu), కర్నాటక(Karnataka), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల నుంచి దాతలు ఈ పుష్పాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, ఏఈవో గురుమూర్తి, భక్తులు పాల్గొన్నారు.