తిరుమల: వార్షిక పుష్పయాగం సందర్భంగా మంగళవారం తిరుమల ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా గార్డెన్ కార్యాలయం నుంచి తిరుమల ఆలయం వరకు టన్నుల కొద్దీ వివిధ రకాల పూలు, ఆకులతో ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీవేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రావణమాసంలో వార్షిక బ్రహ్మోత్సవం అనంతరం పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. మానవాళిని, పశు,పక్ష్యాదులను భూకంపాలు, తుఫానులు, అంటువ్యాధుల నుంచి రక్షించాలని కోరుతూ వార్షిక పుష్పయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
చామంతి, మొగలి, కనకాంబరం, వివిధ రకాల గులాబీలు, తామరలు, లిల్లీలు, మనుసంపంగి, మనోరంజితంతో పాటు తొమ్మిది టన్నులకు పైగా పూలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఈవోతో పాటు ఆలయ డీఈవో రమేష్‌బాబు, ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వీజీఓలు బాలిరెడ్డి, గిరిధర్, ఏవీఎస్వోలు గిరిధర్, శివయ్య, పారుపట్టేదార్ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.