అమరావతి : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, నిష్పక్షపాతంగా పనిచేయాలని ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ సూచించారు. విశాఖపట్నం వేదికగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుల రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో సమావేశానికి గవర్నర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతుల వ్యవస్థను అందించేలా కమిషన్లు పని చేయాలని పేర్కొన్నారు.
సర్వీస్ కమిషన్లు వాటి లక్ష్యాలను చేరుకోవడంలో స్టాండింగ్ కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన హోదా, స్వతంత్ర అధికారాలను పరిరక్షించేలా కృషి చేయాలని కోరారు. కాలానుగుణంగా నోటిఫికేషన్లు ఇస్తూ సకాలంలో పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసే బాధ్యతల్లో ఒకటని గుర్తించుకోవాలని పేర్కొన్నారు.
జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఏపీ గవర్నర్
ఇస్కాన్ ఆధ్వర్యంలో విజయవాడలో జనన్నాథ రథయాత్రను ఏపీ గవర్నర్ ప్రారంభించారు. స్థానిక వజ్రమైదానం రథయాత్ర ప్రారంభం కాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ రథం ముందు నీళ్లు చల్లి చీపురుతో తుడిచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జగన్నాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.