ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కడప, అనంతపురం, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విభజన, కొత్త జిల్లా కేంద్రాల పేర్లపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అవి పాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఇవాళ బంద్ చేపట్టారు. నందికొట్కూరును కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజతో పాటు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొత్త గళం వినిపించారు. జిల్లాల విభజనపై అభ్యంతరాలు తెలిపినేందుకు ప్రభుత్వం వచ్చే నెల 2 వరకు అవకాశం కల్పించింది.
నగరిని బాలాజీలో కలపండి: రోజా
జిల్లాల విభజన నోటిఫికేషన్ ఇచ్చిన చాలా రోజులకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. తన నియోజకవర్గం ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానని రోజా చెప్పారు. విభజనతో నగరి నియోజకవర్గం ఇబ్బంది పడుతున్నదని, నగరిని చిత్తూరు జిల్లాలో కలపడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉన్నదన్నారు. నగరి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన బాలాజీ జిల్లాలో కలపాలని ఆమె కోరారు.
విభజన అశాస్త్రీయం: రామనారాయణరెడ్డి
ఇలా ఉండగా, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఇదే మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రజాప్రతినిధులతో చర్చించకుండా జిల్లాలను విభజించారని మండిపడ్డారు. నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోకుండానే విభజన చేయడం వల్ల భవిష్యత్లో ఘర్షణలు తప్పవని, సోమశిల, కండలేరు జలాశయాల నీటిపంపకాల్లో వివాదాలు వస్తాయని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. రావూరు, కలువాయి, సైదాపురం ప్రజలు నెల్లూరులోనే ఉండాలని సూచించారు. బాలజీ జిల్లాలో చేరడం 3 మండలాల ప్రజలకు అస్సలు ఇష్టం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన, నియోజకవర్గాల పునర్విభజనలో నష్టాన్ని భరించామని, మూడోసారి కూడా నష్టం జరిగితే భరించలేమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.