అమరావతి : విశాఖ స్టీల్( Visaka Steel) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ(YCP) ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు (Privatization) మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకమని తెలిపారు. నిన్న కేంద్రం విశాఖ స్టీల్‌కు ప్రకటించిన రూ. 11,440 కోట్ల ప్యాకేజీ కేవలం ఆక్సిజన్‌లా పనిచేస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ కేవలం అప్పులకే సరిపోతుందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. ప్లాంట్‌ను కాపాడాలని ఉద్దేశ్యం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్‌కు ట్యాక్స్ హాలీడే (Tax Holiday) ఇవ్వాలని, ప్లాంట్‌ను సేయిల్‌లో (SAIL, ) విలీనం చేయాలని, సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కూటమి పాలన వచ్చిన తరువాత కార్మికులకు జీతాలు ఇవ్వలేదని, ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు.
గతంలోనూ ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్లాంట్‌లో వీఆర్ఎస్ను ఎందుకు తీసుకువచ్చారని, 25 వేల మందితో నడవాల్సిన ఉండగా 10వేల మందితో నడుస్తుందని వివరించారు. ఇంకా ఉద్యోగులను తొలగిస్తే ప్లాంట్ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.