Road Accident | ఏపీలో ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ బస్సును భారతి ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రమాదాలు వణికిస్తున్నాయి. అక్టోబర్ 24న కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44పై మంటల్లో ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌పై ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వెళ్లడం వల్ల మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
కర్నూలు ఘటన మరువక ముందే చేవెళ్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వరుస బస్సు ప్రమాదం జరుగుతుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.