అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న వారిపై, అడ్డుకోలేని పోలీసులపై హైకోర్టు (High Court) లో కేసు వేయనున్నామని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నాని (Kodali Nani) వెల్లడించారు. శనివారం కృష్ణా జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగా వైసీపీ శ్రేణుల(YCP Cadre) పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అర్దరాత్రి ఇళ్లకు వెళ్లి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, వ్యక్తులపై దాడులకు(Attacks) పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ (YCP) పార్టీని నిస్తేజం చేయడానికి దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో వైసీపీ శ్రేణులు ఉండవద్దని హెచ్చరిస్తున్నారని వెల్లడించారు. అల్లరి మూకలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకులు పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ(TDP) అల్లరి మూకల దాడుల వీడియోలు, సీసీ పుటేజీలు, ఫొటోలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఎస్పీ, లోకల్ స్టేషన్లో ముందస్తుగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించకపోగా దాడులకు పాల్పడ్డ వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. వైసీపీ జిల్లా తరుఫున హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలకు లోను కావద్దని ఆరోపించారు.