అనంతపురం : హిందూపురం ఎంపీ మరో తలనొప్పి వచ్చి పడింది. సంచలనం రేపిన వీడియో ఎపిసోడ్‌పై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు సూచించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వాసవ్వ మహిళా మండలికి రాష్ట్రపతి కార్యాలయం సమాచారం ఇచ్చింది.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఏపీకి చెందిన పలువురు మహిళా జేఏసీ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల మాధవ్ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఏపీకి చెందిన డిగ్నిటీ ఫర్ ఉమెన్ జేఏసీ ఇటీవల రాష్ట్రపతి ముర్ముతోపాటు ఉపరాష్ట్రపతి దన్ఖడ్, జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళ గౌరవాన్ని మంటగలిపేలా ప్రవర్తించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో విన్నవించారు.
దాంతో రాష్ట్రపతి కార్యాలయం వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ముర్ము.. న్యూడ్ వీడియోకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు నోట్ పంపారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వాసవ్య మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి పీఆర్వో కుమార్ సమ్రేశ్ సమాచారమిచ్చారు. రాష్ట్రపతి సూచనలను ఏపీ సీఎస్ పాటిస్తారో, ఎంపీపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేడి చూడాల్సిందే.