Srisailam | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ముమ్మర ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్ల కౌంటర్లను వేర్వేరు చోట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాంతో కౌంటర్ల వద్ద క్యూలైన్లు సజావుగా నిర్వహించవచ్చన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్లను రథశాల వద్ద నుంచి ప్రారంభించాలని.. అదనంగా క్యూలైన్లను సైతం ఏర్పాటు చేయాలన్నారు.
వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు ఉండాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక క్యూలైనును ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం ఎదుట నుంచి ప్రారంభించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం విరాళా సేకరణ వద్ద వీల్‌చైర్స్‌ను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. క్యూలైన్లలో తొక్కిసలాట జరుగకుండా తగిన స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు శివసేవకులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించిన తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేసిన అత్యవసర గేట్లు సజావుగా పని చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటిని సులభంగా గుర్తించేందుకు ఎర్ర రంగు వేయాలన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో క్యూ కాంప్లెక్స్‌లో మొత్తం 16 కంపార్ట్మెంట్ల ద్వారా ఉచిత దర్శనాలకు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే ఐదు కంపార్ట్మెంట్ల ద్వారా శీఘ్ర దర్శనాలు, మిగతా రెండు కాంపార్ట్మెంట్ల ద్వారా భక్తులను అతిశీఘ్ర దర్శనాలకు అనుమతించనున్నట్లు తెలిపారు. క్యూకాంప్లెక్స్‌లో నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్స్ అందజేయాలని చెప్పారు. మంచినీటి కుళాయిలు, వాష్‌బేషిన్ అన్నీ అందుబాటులోకి తేవాలన్నారు. అన్ని వాటర్ పాయింట్లకు నిరంతరం నీటి సరఫరా జరగాలని చెప్పారు.
భక్తులు క్యూలైన్లను గుర్తించేందుకు వీలుగా అవసరమైన మేరకు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో శౌచాలయాల్లో శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈవో వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీశైలప్రభ సంపాదకుడు సీ అనిల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీ చంద్రశేఖరశాస్త్రి, సెక్యూరిటీ పర్యవేక్షకులు మధుసూదనరెడ్డి, క్యూలైన్స్ విభాగం పర్యవేక్షకులు హిమబిందు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.