Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని పీకే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి ప్రశాంత్ కిశోర్ ఏమైనా బ్రహ్మనా అని విమర్శించారు. పీకే కమర్షియల్ అని తెలుసుకునే ఆయన్ను వద్దనుకున్నామని చెప్పారు.
వైసీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే ఉందని అనుకుంటున్నామని బొత్స తెలిపారు. ప్రశాంత్ కిశోర్ అయినా.. ఐప్యాక్ అయినా తాత్కాలికమని, వైసీపీనే శాశ్వతమని స్పష్టం చేశారు. కో ఆర్డినేషన్ కోసం ఐప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని.. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం తామేనని తెలిపారు. ఐప్యాక్ చెప్పిన వారికి సీట్లు ఇచ్చామనేది అవాస్తవమని పేర్కొన్నారు. వైసీపీకి 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.