ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు. జైల్ రిలీజ్డ్ ట్రాకింగ్ సిస్టం ద్వారా నేరాల నియంత్రణకు చేపట్టిన కార్యక్రమాలకు గాను ఆమెకు ‘గవర్నెన్స్ నౌ ఇండియా పోలీస్ అవార్డు- 2022’ దక్కింది. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడం ద్వారా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో అద్భుతమైన పరివర్తన తీసుకువచ్చిన పోలీసు అధికారులకు గవర్నెన్స్ నౌ ఇండియా పోలీస్ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతిష్ఠాత్మక ఈ జాతీయ పోలీస్ అవార్డు అందుకున్న ఎస్పీ గార్గ్‌ను జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.
ఈ ప్రాజెక్టును ఉపయోగించడం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది వారి పరిధిలోని ఏరియా జైలు నుంచి విడుదలైన ఖైదీల జాబితా, వారి పూర్తి వివరాలు, కార్యనిర్వహణ విధానం, నేరాలకు సంబంధించిన ఇతర వివరాలను వెబ్ లింక్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని వారిపై నిఘా ఉంచే వీలుంటుంది. జైల్ రిలీజ్డ్ ట్రాకింగ్ సిస్టం అనేది నిఘా, పర్యవేక్షణ వర్గం కింద ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అభివృద్ధి చేశారు. శుక్రవారం నోయిడాలో జరిగిన వర్చువల్ ఈవెంట్లో నిర్వాహకులు ఎస్పీ మలికా గార్గ్‌కు అవార్డును అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ గురించి ఆమె వివరించారు. జైలు నుంచి విడుదలైన వ్యక్తులను నిరంతరం పర్యవేక్షించడానికి, తదనుగుణంగా స్థానిక పోలీసులు, సీసీఎస్ పోలీసులను కూడా అప్రమత్తం చేయడానికి డైనమిక్, ప్రోయాక్టివ్ సిస్టంను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసుల అద్భుతమైన కృషికి, ప్రగతికి ఈ అవార్డులు నిదర్శనమని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉత్సాహంగా పని చేసేందుకు ఈ అవార్డులు దోహదపడతాయని పేర్కొన్నారు. రియల్ టైమ్ ఇంటిగ్రేటెడ్ డాటా, జైలు నుంచి విడుదలైన వ్యక్తులపై ట్రాకింగ్ సిస్టం సాయంతో భవిష్యత్‌లో నేరాలను నిరోధించడంలో ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తెలిపారు.