Giddalur MRO Office | ఓఎల్ఎక్స్లో ఇప్పుడు ఒక పోస్టు వైరల్గా మారింది. ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మేందుకు ఉపయోగించే ఈ ఓఎల్ఎక్స్లో ఒక వ్యక్తి ఒక భవనాన్ని అమ్మకానికి పెట్టాడు. బిల్డింగ్ అమ్మకానికి పెడితే అంత ట్రెండింగ్ ఎందుకు అవుతుందని అనుమానం వస్తుందా.. దానికి కారణం ఉంది.. అదేంటంటే.. అది సదరు వ్యక్తికి చెందిన ఇల్లు కాదు.. ప్రభుత్వ భవనం. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఎమ్మార్వో ఆఫీసు!
గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ ఆకతాయి ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడు. అది కూడా కేవలం రూ.20వేలకే. ఈ పోస్టు చాలామందికి చేరడంతో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో చివరకు ఈ విషయం గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి వెళ్లింది. అది తెలిసి కంగుతిన్న ఎమ్మార్వో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీసును అమ్మకానికి పెట్టిన ఆకతాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.