అమరావతి : ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పదవులు శాశ్వతం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) అన్నారు. ఇటీవల ఎన్నికైన ఎంపీలతో టీడీపీ(TDP) పార్లమెంటరీ పార్టీ సమావేశం విజయవాడలోని ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొత్త ఎంపీలకు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని, ఈ విజయాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలని, ఆ తర్వాతే మనమని పేర్కొన్నారు. పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని వెల్లడించారు. ఈనెల 12 న ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించామని, మోదీ వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని చంద్రబాబు అన్నారు. గత ఐదేండ్లలో వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు.