Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద భక్తులు తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నంద్యాల ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్షేత్రానికి వచ్చే వాహనాల కోసం శిఖరం వద్ద నుంచి ముఖద్వారం, సాక్షి గణపతి, హటకేశ్వరం, రామయ్య టర్నింగ్ టోల్గెట్, శ్రీశైలంలోని పరిసర ప్రాంతాలు, శ్రీశైలం ముఖద్వారం నుంచి సున్నిపెంట, లింగాలగట్టు, తెలంగాణ బోర్డర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సుమారు 800 మందిని ట్రాఫిక్ నియంత్రణ కోసం సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం 8 రక్షక్, 20 బ్లూ కోట్స్ వాహనాలను మోహరించినట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎనిమిది డ్రోన్ కెమెరాలతో నిఘా వేసినట్లు పేర్కొన్నారు. ముఖ్య కూడళ్లలో పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇక క్షేత్రానికి వచ్చే భక్తులు పలు సూచనలు పాటించాలని కోరారు. దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఘాట్‌రోడ్డు కారణంగా వాహనాల్లో వచ్చే సమయంలో నైపుణ్యం ఉన్న డ్రైవర్లను వెంట తీసుకువచ్చుకోవాలన్నారు. భారీ గూడ్స్ వాహనాలు శ్రీశైలం వరకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సాక్షి గణపతి రామయ్య టర్నింగ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలుపొద్దని.. ఔటర్ రింగ్ రోడ్డు యజ్ఞశాల ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, ఇతర బస్సుల కోసం విశాలంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కొత్త పార్కింగ్ స్థలం వద్ద కార్లు, తేలికపాటి వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశామన్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మాత్రమే వాహనాలను నిలపాలని.. ఎవరైనా రోడ్డుపై వాహనాలు ఆపితే టోయింగ్ యంత్రం ద్వారా తొలగించి.. ఇతర ప్రాంతాలకు తరలిస్తామని హెచ్చరించారు.