విశాఖ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో అమరవీరుల వారోత్సవాలు జరిపేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నారు. మావోయిస్టుల 50వ అమరవీరుల వారోత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 3వ తేదీ వరకు ఏజెన్సీలో కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఓబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
కొద్ది రోజుల క్రితం వారోత్సవాలు నిర్వహించాలని ఏఓబీ ప్రత్యేక మండల కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ తన లేఖలో పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో వారం రోజులుగా పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. చింతూరు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
మావోయిస్టుల వారోత్సవాలను అడ్డుకునేందుకు అల్లూరి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసులను అప్రమత్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలను మోహరించారు. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కే రవీంద్ర ఆధ్వర్యంలో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు ఉన్న కల్వర్టులు, వంతెనలను సీఆర్పీఎఫ్ పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. జోలాపుట్, మాచ్‌ఖండ్, ఒనకడిల్లి ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నేతలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.