Nagababu Konidela | మాజీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన నేత నాగబాబు మరోసారి సెటైర్లు వేశారు. జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు.
2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని వ్యంగ్యంగా అన్నారు. ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడని.. ఐదేళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదని గుర్తు చేశారు. అప్పుడంటే జగన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదర్లేదని అన్నారు. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉందని తెలిపారు.
జగన్ మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా! కాబట్టి ఆయన కేసును తక్షణమే విచారించాలని నాగబాబు కోరారు. ఈ కేసును తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి జగన్ మోహన్ రెడ్డికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరారు.