Pithapuram | వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని.. అందుకే వైసీపీకి రాజీనామా చేశానని ఈ సందర్భంగా
దొరబాబు మీడియాతో వెల్లడించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని తెలిపారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు వైసీపీని వీడనున్నారు. వీరంతా బుధవారం నాడు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. దొరబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే టికెట్‌ను దొరబాబుకు వైఎస్ జగన్ నిరాకరించారు. పవన్‌పై పోటీగా వంగా గీతను నిలబెట్టారు. కానీ పవన్ కల్యాణ్ చేతిలో వంగా గీత ఘోర పరాజయం పాలయ్యారు. అప్పట్నుంచి వైసీపీపై దొరబాబు నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
పైగా ఎన్నికల ముందు పెండం దొరబాబుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ జగన్ మాట తప్పారు. దీంతో దొరబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పట్నుంచి పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేసినా కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయన వైసీపీ వీడబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే దొరబాబు వైసీపీ నుంచి వైదొలిగారు.