Perni Nani | జనసేన కచ్చితంగా ఏదో ఒక రోజు జాతీయ పార్టీ అవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. జనసేన జాతీయ పార్టీ, టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో ఆదివారం నాడు పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. జనసేన ఐడియాలజీ అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజమా అని ప్రశ్నించారు. జనసేన సిద్ధాంతం ఏంటో అర్థం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారని పేర్ని నాని అన్నారు. అన్ని లిస్టులు అయిపోయాయి.. ఇప్పుడు యూనివర్సలిస్టు వంతు వచ్చిందని విమర్శించారు.
సుగాలి ప్రీతి పేరును ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని పేర్ని నాని తెలిపారు. అధికారంలోకి వచ్చాక మొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసును తీసుకుంటామని అన్నారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు ఆ కేసును సీబీఐ చేత విచారణ చేయించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. పాపపు మాటలు మాట్లాడితే మీకు పాపం చుట్టుకోదా అని మండిపడ్డారు. న్యాయం చేసిన వైసీపీ మీద అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ ఇంటి స్థలం, ఐదెకరాల పొలం, తండ్రికి ఉద్యోగం ఇచ్చారని తెలిపారు.
2017లో సుగాలి ప్రీతి హత్య జరిగితే బాధ్యత ఎవరు తీసుకోవాలని ఆయన ప్రశ్నించారు. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి నిందితులకు బెయిల్ వచ్చిందని తెలిపారు. నిందితులకు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో చంద్రబాబు హయాంలోనే నిందితులకు బెయిల్ వచ్చిందని చెప్పారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని పేర్ని నాని తెలిపారు. పవన్ తీరుతో ప్రీతి కుటుంబం మానసికంగా కుంగిపోయిందని ఆరోపించారు. సుగాలి ప్రీతి హత్య విషయంలో పవన్ కల్యాణ్ ప్రశ్నించాల్సింది చంద్రబాబును అని తెలిపారు. కానీ చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు.
స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్ని నాని అన్నారు. త్వరలో మరో రెండు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారని తెలిపారు. కూటమి నేతల వేధింపులు తాళలేక 1440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారని.. వీఆర్ఎస్ తీసుకోవడానికి మర వెయ్యి మంది ఉద్యోగులు రెడీ ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వైజాగ్‌కు ఏం చేసిందని పేర్ని నాని ప్రశ్నించారు. దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంటులో టెండర్లను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. 42 ప్రైవేటీకరణ టెండర్లు పడితే ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. నాకు ఒక్క ఎంపీ ఉంటేనా.. దేశమంతా చెలరేగిపోయేవాడిని అని పవన్ కల్యాన్ అన్నాడని గుర్తుచేశారు. దాదాపు 60 గంటలకు పైగా విశాఖలో ఉన్న పవన్ కల్యాణ్ రెండోసారి కూడా రుషికొండ వెళ్లారని తెలిపారు. దానికి బదులు స్టీల్‌ప్లాంట్ చూడ్డానికి వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు. ఆయుధాలు తీసుకొచ్చి ఎవరిని చంపమని చెబుతున్నారని నిలదీశారు.
రాష్ట్రంలో రైతాంగమంతా యూరియా లేక విలవిల్లాడుతోందని పేర్ని నాని అన్నారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో కూడా రైతులంతా యూరియా కోసం రోడ్డెక్కారని తెలిపారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క రైతైనా యూరియా, నత్రజని అందలేదని ఎవరైనా అన్నారా అని ప్రశ్నించారు. యూరియాను టీడీపీ నేతలు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్‌షాతో మీకు ఫ్రెండ్షిప్ ఉందని.. మరి యూరియా గురించి ఎందుకు మాట్లాడలేదని పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. మాట్లాడితే మోదీ భాయ్, అమిత్ భాయ్ అంటావు కదా.. ఒక్క ఫోన్ చేసి యూరియాను తెప్పించని డిమాండ్ చేశారు.