విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వంకలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నదికి ఇన్ ఫ్లో పెరగడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీ కూనవరం గ్రామం భారీ వర్షాలకు వరద నీటితో ముంపునకు గురైంది. ప్రభుత్వ సాయం కోసం ఏజెన్సీ వాసులు ఎదురుచూస్తున్నారు. ఇలాఉండగా, ఏపీలో మరో 24 గంటల పాటు వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. అన్ని జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడి ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారీ వరదల కారణంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండిపోయాయి. అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాకినాడ, అల్లూరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురవగా.. నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మత్స్యకారులు ఈ నెల 16 వరకు చేపల వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. శుక్రవారం నుంచి రెండు, మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నది.
ఇలాఉండగా, ఏజెన్సీలోని చింతూరు గ్రామం పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుపోయింది. ఇంట్లోని సరుకులను తీసుకుని చెట్ల కింద వంటలు చేసుకుంటున్నారు. తాగడానికి నీరు కరవై ఇబ్బందిపడుతున్నారు. వరదలతో తమ గ్రామం నీటిలో మునిగిపోగా, తమను ఆదుకునేందుకు ఒక్కరు కూడా రావడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను రక్షించేందుకు పోలీసులు, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ ఎవరూ రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకున్నారు. గ్రామంలో 150 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి.
మరో 24 గంటలు వర్షాలు..
బుధవారం నాటికి దక్షిణ ఒడిశాలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో పరివేష్టిత ఉపరితల ద్రోణిలో నైరుతి దిశలో ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవన ద్రోణి, షీర్ జోన్ దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ పేర్కొన్నది.