అమరావతి : ఏపీలో తప్పుడు రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఆమోదించరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దెశించి మాట్లాడారు. తెలుగు జాతి వెలుగు, పౌరుషం నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆయన యుగ పురుషడని అన్ని రంగాల్లో ఆయనకు ఆయనే సాటి అని ప్రశంసించారు.
అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయంలోకి రాలేదని తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం, పేద ప్రజల అండగా ఉండేందుకు వచ్చారనిఅన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం నేడు దేశానికే ఆహార భద్రత అయ్యిందని వెల్లడించారు. ఎన్టీఆర్ పరిపాలన దక్షుడు, సంస్కార వాది అని ప్రశంసించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు.
ఒంగోలు జిల్లా టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. టీడీపీ మహానాడుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని తెలిపారు. మహానాడును చూసి జగన్తో సహ వైసీపీ నాయకులు గుండెలు పగిలేలా జనాలు తరలిరావాలని కోరారు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలని సూచించారు.