అమరావతి : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీనమేషాలు లెక్క పెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని (Allaince Government ) తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి (Peddireddy Ramchandra reddy) పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మోసాలతో చంద్రబాబు ( Chandra Babu) కాలం వెల్లబుచ్చుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూటమిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గత ఏడు నెలల కూటమి పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలు, మోసాలు, అక్రమ కేసులను ప్రజలకు వివరించి వారిని చైతన్య పరచాలని నాయకులకు పిలుపునిచ్చారు.
త్వరలోనే వైఎస్ జగన్ (YS Jagan) ప్రజల్లోకి రానున్నారని వివరించారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని , మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి చేకూర్చామని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందులున్నా కూడా చెప్పిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించామని వివరించారు.