అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan) శుక్రవారం కాకినాడ యాంకరేజ్ పోర్టులో (Kakinadaport) తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు. ఇటీవల పశ్చిమ ఆప్రికాకు 1,064 టన్నుల రేషన్ బియ్యాన్ని (Ration Rice) అక్రమంగా తరలిస్తు పట్టుబడ్డ నౌక ఉన్న ప్రాంతానికి బోటులో వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా బియ్యం సంచులను తనిఖీ చేశారు. భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారుల పేర్లను నమోదు చేయాలని, బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్న చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడి ఉచిత బియ్యాన్ని విదేశాలకు తరలించి కిలోకు రూ.75లకు అమ్ముకుని వేలాది కోట్లు సంపాదించుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులు పట్టుకున్న బియ్యం నౌకను సీజ్ చేసి(Ship seize) , పోర్ట్ అధికారులకు (Port Officers) నోటీసులు ఇవ్వని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు మూలాలు చాలా బలంగా ఉన్నాయని వెల్లడించారు. జిల్లా ఎస్పీకి అక్రమ బియ్యం రవాణాపై నివేదిక అడిగితే ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదని, తన పర్యటనలో ఎస్పీ ఎందుకు కనిపించడం లేదని, నేను వచ్చే టైమ్‌కు ఎస్పీ ఎందుకు సెలవు తీసుకున్నాడని ప్రశ్నించారు.
హోంమంత్రికి లేఖ రాస్తా
పోర్ట్‌లో సరైన తనిఖీలు లేకపోతే జాతీయ భద్రతకు పెను ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం, పోర్ట్‌లో భద్రత అంశాలను కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఏపీ గంజాయి, డ్రగ్స్‌కు అడ్డగా మారిందని ఆరోపించారు. ముందుగా అధికారుల ప్రక్షాళన జరగాల్సి ఉందని అన్నారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలకు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నారని అక్కడే ఉన్న ఎమ్మెల్యే కొండబాబుకు చురకలంటించారు. స్థానిక ప్రజాప్రతినిధిగా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.