అమరావతి : తూర్పు గోదావరి ( East Godavari ) జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి మెయింటినెన్స్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 16 నెలల వేతనం చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు గత మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం గ్రామీణ నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట అర్దనగ్న ప్రదర్శన చేపట్టారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సంబంధిత మంత్రిగా జోక్యం చేసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని కార్మికులు వాపోయారు. గత ప్రభుత్వం నుంచి రావల్సిన బిల్లులు కాంట్రాక్టులకు రాక తమ వేతనాలు నిలుపుదల చేయడంతో నిరసనలు చేస్తున్నామని పేర్నొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖను నిర్వహిస్తున్న పవన్‌కల్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని 16 నెలల వేతనాలు చెల్లించేలా అధికారులతో మాట్లాడాలని కోరారు. తమకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులను కూడా మానివేశారని ఆందోళన వ్యక్తం చేశారు.