అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన కొణిజేటి రోశయ్య నిష్కళంక రాజకీయయోధుడని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ” జనసేన పార్టీ స్థాపించిన తరువాత రెండు, మూడుసార్లు కలిసినప్పుడు ఆయన నాకు ఎన్నో విలువైన సలహాలు అందించి ఎంతో అభిమానం చూపారని పవన్ పేర్కొన్నారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే 1968లో శాసనమండలి సభ్యునిగా ఎంపికైనది మొదలు ఆయన నిరంతరంగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూనే వున్నారు.
ఒకసారి శాసనసభకు మరోసారి పార్లమెంటుకు ఎన్నికై మూడు సభలలోను తనదైన శైలితో ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యమంత్రులు మారినా మంత్రిమండలిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపై విశేష అనుభవం ఉన్న రోశయ్య గారు 15సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆ అనుభవం, ఆయనలోని విధేయత ఆయనను ముఖ్యమంత్రిగా నిలిపిందని జనసేన అధినేత అన్నారు.
నీతి,నిజాయితీలతో రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన రోశయ్య గారు నేటి పాలకులకు నిస్సందేహంగా ఆదర్శప్రాయులు. రోశయ్య గారి మృతికి నా తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కుటుంబ సభువులకు నా సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో వారికి భగవంతుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను” అని పవన్ పేర్కొన్నారు.