అమరావతి : ఏపీలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి ఓటు వేయించుకుని గెలుపొందారని ఆరోపించారు.
టీడీపీ అరాచకాలపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని, తన నోటికి ప్లాస్టర్ ఎందుకు వేసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్ ప్రోత్సహిస్తున్నాడని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి వైసీపీకి 33 మంది కార్పొరేటర్ల బలం ఉండగా ప్రలోభాలకు గురిచేసి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకున్నారని ఆరోపించారు. ఎన్నిక రోజున మరో ఐదుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం బాధేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ పదవికాలం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అధికారంలో ఉన్న సభ్యులు అవిశ్వాసం పెట్టడానికి సిద్దమవుతున్నారని తెలిపారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థాయి సంఘం ఎన్నికల్లో తన స్థాయిని తగ్గించుకున్నాడని ఆరోపించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. తాను పార్టీ మారే ఆలోచన లేదని వెల్లడించారు.