అమరావతి : ఎన్నికల రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా చూపిస్తానంటూ అధికార పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్ల మీదకు వచ్చిపోరాడుతున్నానన్నారు. ఎవరికో కొమ్ముకాస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
బీజీపీ, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదని, పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమీషన్లు కొట్టేసే రకం కాదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఇంకముందూ అధికార పార్టీ వైఎస్సార్సీపీ వాడుకుంటోందని విమర్శించారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లాఠీ దెబ్బలు తినేందుకైనా.. జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు వస్తాయన్నారు. అధికారం పోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ దాడులు చేసే అవకాశాలుంటాయన్నారు. మాచర్లలో పార్టీ కార్యాలయం తగులబెట్టడం చూశామని, జనసేన నేతలు ఎన్నికల వ్యూహం వదిలేస్తే తాను చూసుకుంటానన్నారు. జనసేనను అధికారం దిశగా నడిపించే బాధ్యత మాది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మీరందరు కోరుకుంటే నేను సీఎం అవుతా.. లేకపోతే కానన్నారు. వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వననే మాటకు కట్టుబడి ఉన్నానని, నేను మీ కోసం పని చేయకపోతే నా చొక్కా పట్టుకోండి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా సత్తెనపల్లికి వచ్చిన పవన్ కల్యాణ్ గుంటూరు శివారు నల్లపాడు వద్ద అభిమానులు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. అయితే, పోలీసులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. గజమాల వేస్తామని తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని పోలీసులు పేర్కొనగా.. మాల కూడా వేయనివ్వరా? అంటూ జనసేన నేతలు నిరసన తెలిపారు.