అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న మంత్రుల వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నపూర్ణ లాంటి కోనసీమలో క్రాప్ హాలీడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రైతులు తమ గోడును వెల్లబుచ్చుకుంటుంటే వైసీపీ నాయకులు రైతులపైనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. టెన్త్లో విద్యార్థులు ఫెయిల్ అయితే తల్లిదండ్రుల మార్గనిర్దేశం సరిగా లేదని ఆరోపించడం బాధకరమని అన్నారు.
అత్యాచారాలు జరిగితే తల్లి పెంపకం సరిగా లేదని విమర్శలు చేశారని ఆరోపించారు. హామీలు నెరవేర్చాలని ఉద్యోగులు రోడ్డెక్కితే బాధ్యతలేదని వ్యాఖ్యలు చేయడం బాధ్యతరాహిత్యానికి నిదర్శనమని వివరించారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా రాజకీయంగా విమర్శించడమే తప్ప వాటిని పరిష్కరించే ధోరణి ప్రభుత్వం వద్ద లేదని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.