Padmavati Ammavari Temple | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుంచి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.