తిరుపతి : తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు బుధవారం సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనున్నది.
ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏటా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. పవిత్రోత్సవం తొలి రోజు 8 వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, 9న పవిత్ర సమర్పణ, 10 న పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. వీరికి 2 లడ్డూలు, 2 వడలు ప్రసాదంగా అందజేస్తారు.
పలు సేవలు రద్దు
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 6 న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, 7 న అంకురార్పణం సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. పవిత్రోత్సవాల్లో మొదటిరోజు తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, రెండో రోజు అభిషేకానంతర దర్శనం, బ్రేక్ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, చివరి రోజున ఉదయం సామవేద పుష్పాంజలి, బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది.
6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 6న మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. భక్తులను ఉదయం 10 గంటల నుంచి అమ్మవారి సర్వదర్శనానికి అనుమతిస్తారు.