Panchayat Secretary | తిరుపతి : ఓ పంచాయతీ కార్యదర్శి కోట్లకు పడగలెత్తాడు. ఎవరూ ఊహించని విధంగా ఆస్తులను కూడబెట్టాడు. ఆ పంచాయతీ కార్యదర్శి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ పూర్వ కార్యదర్శి మహేశ్వరయ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై తిరుపతి, కడప జిల్లాల ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఫిబ్రవరిలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో తాజాగా తిరుపతి పేరూరులోని మహేశ్వరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, భారీగా బంగారం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ. 85 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు.
చిత్తూరు జిల్లా గంగవరంలో ప్రధాన రహదారిపైన సుమారు రూ.ఐదారు లక్షలతో మహేశ్వరమయ్య గతంలో అమ్మవారి ఆలయం నిర్మించారు. ఇటీవల ఈ ఆలయాన్ని ఆధునికీకరించారు. ఇదంతా పాప పరిహారం కోసమే చేసినట్టు ఉందంటూ అక్కడి ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.