తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam ) ఘనంగా జరుగుతున్నాయి. అఖరు రోజు శుక్రవారం పంచమి తిథిని పురస్కరించుకుని అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.
ముందుగా పంచమి తీర్థ (Panchami Tirtham) మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.
అంతకుముందు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో, అదనపు ఈవోలకు టీటీడీ తరుఫున సారెను అందజేశారు. సారెకు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు-కుంకుమ, చందనం, పట్టుచీరతో పాటు రూ కోటి 20 లక్షలతో వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటం, వజ్రాలహారం, గాజులు, దుద్దెలు సారెగా సమర్పించారు.