తిరుపతి : ఇష్టమైన రంగాల్లో లక్ష్యాలు నిర్ణయించుకుని, ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే విద్యార్థినులు అద్భుతాలు సృష్టించవచ్చునని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి అన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుందని, వాటిని వెలికి తీసి సమాజావృద్ధికి అంకితమవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పీజీ కళాశాల 70వ వార్షికోత్సవం సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంతో పాటు విద్యను ప్రోత్సహిస్తున్న ఏకైక సంస్థ టీటీడీ మాత్రమేనని సదా భార్గవి చెప్పారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పీజీ కళాశాల ఇటీవల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు రావడానికి కృషి చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులను ఆమె అభినందించారు. విద్యను స్వామివారు ఇస్తున్న మహా ప్రసాదంగా భావించి చక్కగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదని, జ్ఞానానికి ఉద్యోగానికి సంబంధం లేదని ఆమె చెప్పారు. ప్రస్తుత సమాజంలో మహిళ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్నారు. మాతృ భాషను గౌరవించుకుంటూ మనకు మనం గౌరవించుకోవాలన్నారు.
ఎస్ వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్, సమాజం అభివృద్ధి కోసం విద్యార్థినులు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. అవరోధాలను కూడా అనుకూల అంశాలుగా మలుచుకుని అభివృద్ధి వైపు సాగాలన్నారు. వైదిక్ సైన్స్ లో వేల సంవత్సరాల క్రితమే నానో టెక్నాలజీ, విమానాలు, బ్రహ్మాస్త్రాల గురించి తెలిపారని, సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరం కూడా వెల్లడించారని చెప్పారు. స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి లక్ష్యాలను నెరవేర్చుకోవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యాశాఖాధికారి గోవింద రాజన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ, ప్రొఫెసర్ భువనేశ్వరిదేవి, కళాశాల కౌన్సిల్ అధ్యక్షురాలు కుమారి అంజుమన్ రెహమాన్ తోపాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.