అమరావతి : రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేందుకు ప్రత్యేక విజన్‌ను తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. పీ3 విధానం గేమ్ ఛేంజర్ (Game Changer) కానున్నదని పేర్కొన్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడమే తమ లక్ష్యమని అన్నారు.
వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ (పీ3) విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం (Income) వస్తుందని పదేపదే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదాయం పెరిగితే పేదవారిని పైకి తీసుకురావచ్చని వివరించారు. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చని ఆయన అన్నారు.
వచ్చిన 7 నెలల్లోనే స్వర్ణాంధ్ర విజన్ ( Swarnadhra Pradesh ) డాక్యుమెంటరీ 2047ను పది సూత్రాలతో మళ్లీ విజన్‌ను తీసుకొచ్చామని వివరించారు. దీనికి దేశంలో ఎక్కడా లేని విధంగా 16 లక్షల మంది తిలకించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని తీసుకొచ్చినప్పుడు తిండిపెడ్తుందా అని ఎగతాళి చేశారని, ప్రస్తుతం ఐటీ సెక్టర్ అత్యున్నత స్థాయిలో ఉందని అన్నారు. ఐటీ లేనిదే ప్రపంచ లేదని తెలిపారు. హైదరాబాద్ నగరం ఐటీగా అభివృద్ధి చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం ఐటీ నుంచే అధికంగా వస్తుందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని , పోలవరాన్ని ( Polavaram) భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం తన లక్ష్యమని, 42వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యమని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వల్ల రాబోయే ఐదేండ్లకు రూ. 1,20,056 కోట్ల ఆదాయం వస్తుందని దీమాను వ్యక్తం చేశారు.