అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. . నిన్న వైసీపీకి చెందిన నాయకుడు, గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వివాదస్పదమవుతుంది. గంగమ్మ ఆలయ కమిటీకి చైర్మన్తో పాటు పాలకవర్గాన్ని ప్రభుత్వం నూతనంగా నియమించడంతో పార్థసారథి కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు.
దీంట్లో భాగంగా ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు తాజాగా పార్థసారథి సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆలయ చైర్మన్ పదవికి రూ.15 లక్షలు తీసుకున్నారని వీడియోలో వెల్లడించడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. తన నుంచి కూడా వైసీసీ నాయకులు డబ్బులు తీసుకున్నారని ఆయన పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది . కాగా ఇవాళ గ్రామంలో నిర్వహిస్తున్న అంత్యక్రియలకు వాల్మీకి సంఘాల నేతలు భారీగా తరలివస్తున్నారు. ముందు జాగ్రర్త చర్యగా గ్రామంలో పోలీసులు మోహరించారు.