అమరావతి : దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు, ఈశాన్య ప్రాంతానికి వారధిగా ఉన్న గోదావరి రైల్వే ఆర్చ్ బ్రిడ్జిపై రైళ్ల వేగాన్ని పెంచారు రైల్వే అధికారులు. గత నాలుగు నెలల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీట్లరు వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గోదావరి – కొవ్వూరు స్టేషన్ల మధ్య ఉన్న 2.9 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై 2015 నుంచి రైళ్ల గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉండేది.
అయితే ఈ వేగాన్ని 2022 ఏప్రిల్‌లో గంటకు 40 కిలోమీటర్లకు పెంచి అమలు చేస్తున్నారు. తాజాగా మరోసారి గంటకు 40 నుంచి 50 కి.మీలకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్రిడ్జ్‌పై వేగాన్ని పెంచేందుకు గాను అధికారులు ఇటీవల పట్టాల కింద ఉండే స్లీపర్లను మార్చి, ట్రాక్‌ను పటిష్టం చేశారు. 50 కి.మీల వేగంతో రైలు ప్రయాణించేందుకు వీలుగా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇంచార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.