Devara | జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రదర్శన సమయంలో అపశ్రుతి నెలకొంది. తన ఫేవరేట్ హీరో సినిమా తొలి రోజే చూడాలని వచ్చిన ఓ అభిమాని.. థియేటర్లో అరుపులు, కేకలకు గుండె ఆగి మరణించాడు. ఏపీలోని కడప జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కడప జిల్లాలోని అప్సర థియేటర్లో దేవర సినిమా ప్రదర్శించబడుతుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో థియేటర్ దగ్గర ఫ్యాన్స్ సందడి నెలకొంది. ఈలలు, కేరింతలతో ఫ్యాన్స్ మొత్తం హంగామా చేశారు. ఈ క్రమంలోనే సీకే దిన్నె మండలం జమాల్‌పల్లి గ్రామానికి చెందిన మస్తాన్‌వలి కూడా అప్సర థియేటర్‌కు వచ్చాడు. తన ఫేవరేట్ హీరో సినిమా తొలిరోజే చూడాలని ఫ్యాన్స్ కోసం వేసిన స్పెషల్ షోకు టికెట్ తీసుకున్నాడు. హాలులోకి వెళ్లి చాలాసేపు సినిమాను ఎంజాయ్ చేశాడు. ఎంతో ఉత్సాహంగా సినిమా చూస్తూ ఈలలు, కేకలు వేశాడు. ఇంతలోనే అకస్మాత్తుగా కుర్చీలోనే కూలబడిపోయాడు. ఇది గమనించి వెంటనే మస్తాన్‌వలిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.