అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై ఘాటుగా స్పందించి అధికార పార్టీకి చెందిన నాయకులపై పలు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. ‘భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు’ అనే సందేశం మహిళలు ఆవేదన చెందేవిధంగా ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి మహిళలు కమిషన్‌కు ఫిర్యాదులు చేశారని వెల్లడించారు. ఇకనైనా తప్పును తెలుసుకుని మహిళాలోకానికి వెంటనే సంజాయిషీ ఇవ్వాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె సూచించారు. మహిళలను ఉద్దేశించి స్టెప్ని అనే పదం ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అన్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నోటీసును జారీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.