విజయవాడ: తాను పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టడం లేదని, పార్టీ పెడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రిస్టియన్ల సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అందుకే వారి సమస్యలను విని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, మైనార్టీల సమస్యలను పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సమావేశమై చర్చించిన బ్రదర్ అనిల్‌కుమార్.. సోమవారం విజయవాడలోని ఓ హోటల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీ ప్రభుత్వంలో ఎంతలా ఇబ్బందులు పడుతున్నది ఏకరువుపెట్టారు. తమను సీఎం జగన్ కలవనీయడం లేనందునే బ్రదర్ అనిల్‌కు మా సమస్యలు తెలిపామని మరో రెండు మూడు రోజుల్లో మరోసారి బ్రదర్ అనిల్‌లో భేటీ అయి కార్యాచరణ సిద్ధం చేస్తామని ఎస్సీ వర్గాలు తెలిపాయి.
కుటుంబపాలన వద్దని, ఏపీలో మార్పు రావాలని జగన్ పార్టీకి ఓటేసి గెలిపించామని, అయితే బీసీ సమస్యల గురించి సీఎం జగన్‌కు విన్నవించుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొన్నదని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు చెప్పారు. గతంలో బ్రదర్ అనిల్ రహస్యంగా సమావేశం పెట్టి జగన్‌కు ఓటేయాలని చెప్పడం వల్లనే వైసీపీ పక్షాన నిలిచామని ఆయన స్పష్టం చేశారు. కాగా, మాట తప్పి మడమ తిప్పుతున్న జగన్‌కు పోటీగా కొత్త పార్టీ పెట్టాలని కోరగా.. త్వరలో శుభవార్త వింటారని చెప్పారని నాగరాజు వెల్లడించారు. ఇలాఉండగా, ఈ నెల 23 వ తేదీన కొత్త పార్టీ ప్రకటన ఉండనున్నదని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాల నేతలు ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పడం విశేషం.