అమరావతి : విశాఖలో శారదాపీఠానికి నిబంధనలకు విరుద్దంగా భూ కేటాయింపు ఉంటే వాటిని రద్దు చేస్తే అభ్యంతరం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (YCP MLC Botsa) వెల్లడించారు. శారదాపీఠానికి (Sharadapeetam) భూముల కేటాయింపుల రద్దుపై ఏపీ మండలిలో (Council) మంగళవారం చర్చ జరిగింది.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ధార్మిక సంస్థలకు భూకేటాయింపులు గత ప్రభుత్వాల నుంచి కొనసాగుతుందని అన్నారు. గురుదక్షిణగా ఇచ్చారని మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు చర్చను లేవనెత్తుతూ విశాఖలో రూ. 300 కోట్ల భూమిని వైసీపీ ప్రభుత్వం రూ.15 లక్షలకే శారదాపీఠానికి అప్పగించిందని ఆరోపించారు.
మార్కెట్ విలువ వసూలు చేయాల్సి ఉండగా పాటించలేదని అన్నారు. ఎకరా రూ. 1.5 కోట్లు ఉండగా కేవలం రూ.లక్షకే కేటాయించిందని పేర్కొన్నారు. భూమలు కేటాయింపులకు జీవీఎంసీ ఆమోదం, ఎన్వోసీ తీసుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూములు రద్దు చేసిందని గుర్తు చేశారు.
వేద పాఠశాల కోసం భూములను తీసుకుని వాణిజ్య అవసరాలకు అనుమతి కోరారని మంత్రి అనగాని వెల్లడించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిబంధనలను ఉల్లంఘించి గురుదక్షిణగా శారదాపీఠానికి భూములిచ్చారని ఎద్దేవా చేశారు.