Kotamreddy Sridhar Reddy | తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం రూ.3 కోట్ల వరకు ఖర్చుచేశారని అన్నారు. కార్యకర్తలు ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
ఇక పొలిటికల్ గేమ్ ఓవర్ అని.. ప్రజలే విన్నర్స్ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల వరుసలో చేరానని.. వచ్చే జన్మలోనూ ఈ గెలుపును మరిచిపోలేనని అన్నారు. ఈ ఎన్నికల్లో తన వ్యక్తిత్వాన్ని ఆదాల హననం చేశారని.. తన కుటుంబసభ్యులను సైతం అవమానపరిచారని చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు తనకు తెలియదని.. ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు. అందుకే అధికారాన్ని ధిక్కరించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. వైఎస్ జగన్ను ఢీకొట్టిన నేను ఈ పసికూనలు లెక్కచేయనని స్పష్టం చేశారు.
ప్రజల అండ ఉంటే కొండలను సైతం తలతో కొడితే పగిలిపోతాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన గెలుపు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల కృషిని మరవలేనని చెప్పారు. వామపక్ష సానుభూతిపరులు నిశ్శబ్ద విప్లవం చేసి తనను గెలిపించారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు సైతం తన విజయానికి కృషి చేశారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా తన వెంట నడిచిన నాయకులకు సూచించారు. కక్ష సాధింపులకు పాల్పడితే తన గడప మెట్లు కూడా తొక్కనివ్వనని హెచ్చరించారు. నెల్లూరు ప్రజల గుండెల్లో పది కాలా పాటు నిలిచిపోయే పనులు చేస్తానని తెలిపారు. నేతలు తనను స్ఫూర్తిగా తీసుకునేవిధంగా పనిచేస్తానని పేర్కొన్నారు. అధికారం వచ్చిందని అహంకారం తలకెక్కితే మనకు కూడా జగన్కు వచ్చిన పరిస్థితే వస్తుందని హెచ్చరించారు.