చిత్తూరు: రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి ఆచూకీ తెలిసింది. దాంతో మిస్సింగ్ కథ సుఖాంతమైంది. అమ్మ కొట్టిందన్న కోపంతో తాత దగ్గరకు వెళ్లిన బాలుడిని గుర్తించడంతో చిన్నారి కుటుంబం సంతోషంతో ఉప్పొంగిపోయింది.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు ప్రశాంత్ నగర్‌కు చెందిన గీత పెద్ద కుమారుడు 9 ఏండ్ల విష్ణువర్ధన్. మూడు రోజుల క్రితం పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి మందలించి కొట్టింది. దాంతో శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన విష్ణువర్ధన్ కనిపించకుండా పోయాడు. తెలిసిన వారి ఇళ్లల్లో, స్నేహితుల వద్ద ఆరా తీసిన తల్లిదండ్రులు టూ టౌన్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి నుంచి బయల్దేరిన రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రశాంత్ నగర్ నుంచి గిరింపేట దుర్గమ్మ గుడి వైపునకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మనవడు అదృశ్యమైన విషయం తెలుసుకున్న తాత.. తవణంపల్లె మండలం దిగువ తడకర నుంచి వెతుక్కుంటూ చిత్తూరు చేరుకున్నారు. అయితే, విష్ణువర్ధన్ శనివారం సాయంత్రం నడుచుకుంటూ చిత్తూరుకు 18 కిలోమీటర్ల దూరంలోని దిగువ తడకరకు వచ్చాడు. చీకటి పడటంతో అక్కడే ఓ ఇంట్లో నిద్రించాడు. బాలుడిని చూసి గుర్తించిన స్థానికులు.. విషయాన్ని గీత తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి మందలించి కొట్టడంతో ఎవరి సాయం తీసుకోకుండానే కాలినడకన 18 కిలోమీటర్ల దూరంలోని తాత ఇంటికి వెళ్లడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు ఎట్టకేలకు ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు సంతోషం వ్యక్తం చేశారు.