ఢిల్లీ, జూలై 16 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి బీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఇరు రాష్ర్టాలు ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో, ముఖ్యంగా మూడు అంశాల మీద సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. ఇరురాష్ర్టాల్లోని రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి నీరు వెళ్లే ఔట్‌ఫ్లో వద్ద టెలీమెట్రి మిషన్లు ఏర్పాటు చేయాలని ఇరు రాష్ర్టాలు అంగీకరించాయి. శ్రీశైలం ప్రాజెక్టు తెలుగుజాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును మనం కాపాడుకోవాల్సిన అవసరముంది. శ్రీశైలం మరమ్మతులు, రక్షణపై నిపుణులు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు వెనువెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం.
సీడబ్ల్యూసీ ప్రతిపాదనల మేరకు శ్రీశైలం ప్లంజ్‌పూల్ రక్షణ చర్యలు చేపట్టాలని, శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కృష్ణానదికి సంబంధించిన కేఆర్ఎంబీని అమరావతిలో ఉండేవిధంగా, గోదావరికి సంబంధించిన జీఆర్ఎంబీ హైదరాబాద్‌లో ఉండేలా రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద, తెలంగాణ రాష్ట్రం ప్రస్తావిస్తున్న కృష్ణా, గోదావరికి నీటి లభ్యతకు సంబంధించి.. రెండూ కూడా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి, ఒక పరిష్కారం చూపేవిధంగా సాంకేతిక, పరిపాలన అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా, పెద్దగా కాలయాపన లేకుండా సోమవారంలోపు కమిటీని ఏర్పాటు చేసుకుని, ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటీ ద్వారా రెండు రాష్ర్టాలకు న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్లాలని ఇరురాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్రజల్‌శక్తి మంత్రి బీఆర్ పాటిల్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు’ అని రామానాయుడు తెలిపారు.
కేంద్రజల్‌శక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం తర్వాత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ‘భిన్నమైన రాష్ర్టాలుగా ఉండొ చ్చు, భిన్నమైన పార్టీలుగా ఉండొచ్చు… కానీ తెలుగు ప్రజలు ఒక్కటే. ఆ ఉద్దేశంతోటే కలిసిమెలిసి పనిచేసుకోవాలనే ఆలోచనతో, మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి… కేంద్రమంత్రి జీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇది తెలుగు ప్రజలందరికీ శుభపరిణామం. కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కమిటీకి సంబంధించి సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి. గోదావరిలో ప్రతీ సంవత్సరం 3వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా పోతున్నాయి. అలాంటి రికార్డులను ముందుపెట్టుకుని, సాంకేతిక అంశాలకు సంబంధించి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుంటే.. అవసరమైతే ఇరురాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్ర జల్‌శక్తి మంత్రి వద్ద, లేదంటే అపెక్స్ కౌన్సిల్లో సమావేశం జరుపుకోవడమా అనేది నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించారు.