విశాఖపట్నం: తండ్రి మందలించడంతో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చీడికాడ కోనాం శివారు గిరిజన గ్రామమైన గుంటిలో చోటుచేసుకుంది. ఎస్ ఐ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటి గ్రామం పక్కనే ఉన్న కొత్తూరుకు చెందిన కడలి రాజుతో అచ్చిబాబు కుమార్తె దేవి వివాహం ఇటీవల జరిగింది. కాగా, దేవి తండ్రి అచ్చిబాబు మద్యం తాగేందుకు రాజు స్వగ్రామానికి రావడాన్ని గమనించిన అల్లుడు మామ అచ్చిబాబును మూడ్రోజుల క్రితం మందలించాడు.
తన తండ్రిని ఎందుకు మందలించావంటూ భర్త రాజుతో దేవి గొడవ పడి రెండు రోజుల క్రితం తల్లి ఇంటికి వెళ్లిపోయింది. దాంతో తండ్రి అచ్చిబాబు ఆమెను మందలించి శుక్రవారం భర్త వద్దకు దింపి వచ్చాడు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన దేవి పురుగుల మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను భర్త, కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.