అమరావతి : వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి మరీ వారి పెళ్లి చేసుకొని ప్రేమను నిజం చేసుకున్నారు. కానీ, ఇంతలోనే ఆ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన లితిన్తో డిగ్రీ చదువుతున్న సమయంలో చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన మోహన చంద్రలేఖ(22) ప్రేమలో పడింది.
పెద్దలను ఎదిరించి గత నెల 23న వివాహం చేసుకోగా.. పెళ్లయిన రెండు మూడు రోజులకే కట్నం లేకుండా వొట్టి చేతులతో వచ్చావంటూ చంద్రలేఖను వేధించి అత్తింటివారు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ విషయంపై భర్తతో చెప్పినా అతను పట్టించుకోలేదని తెలిసింది. ప్రేమించి తప్పు చేశాననే ఆవేదనతో తండ్రికి తెలిపింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.
ఈ క్రమంలో మనో వేదనకు గురైన చంద్రలేఖ ఇంటికి వెళ్ల తాను తప్పు చేసి మిమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చేశానంటూ తల్లిదండ్రుల వద్ద విలపించి, మంగళవారం ఉదయం ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివాహం అయిన నెలరోజులకే చంద్రలేఖ ఆత్మహత్య చేసుకోవడంతో స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.