అమరావతి : స్క్రబ్ టైఫస్ అనే కీటకం ఏపీ వాసులను కలవరానికి గురి చేస్తుంది. ఈ కీటకం కుట్టడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,317 మందికి పాజిటివ్ కేసులు ( Positive Cases ) నమోదై ఆసుపత్రుల పాలయ్యారు. అన్ని జిల్లాలో వ్యాధి వ్యాపిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్క్రబ్ టైఫస్ ( Scrub Typhus ) కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురై విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందింది.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి(36) అనే మహిళ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, స్క్రబ్ టైఫస్ సోకిందని నిర్ధారించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.
చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్స్ తో నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.