AP News | పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై కక్ష గట్టాడో ఉన్మాది. తనతో కలిసి ఏడడుగులు వేయడానికి ఇష్టపడని అమ్మాయి.. ఈ భూమ్మీదే ఉండకూడదని అనుకున్నాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఆమెను చంపేందుకు యత్నించాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రానికి చెందిన నాగార్జున అనే యువకుడు కొంతకాలంగా పాతూరు గ్రామ పరిధిలోని యాదవ పాలెంలో ఉంటున్న ఓ యువతి వెంట పడుతున్నాడు. తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. కానీ అతనితో పెళ్లికి సదరు యువతి ఒప్పుకోలేదు. అయినప్పటికీ నాగార్జున ఆమె వెంట పడటం మానలేదు. ఈ క్రమంలోనే సదరు యువతికి ఇంట్లో వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన నాగార్జున ఆగ్రహంతో ఊగిపోయాడు. సదరు యువతికి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. కూతురిపై కత్తితో దాడి చేయడం చూసిన ఆమె తల్లి కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అడ్డొచ్చిన యువతి తల్లిపై కూడా నాగార్జున కత్తితో దాడి చేశాడు.
యువతి, ఆమె తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా అక్కడకు వచ్చారు. దీంతో భయపడిపోయిన నాగార్జున అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లీకూతుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు నాగార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు.