పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : వెంకటాచలం మండలంలో బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. అతడు బాధితురాలి సమీప బంధువుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, యాసిడ్ దాడికి గురైన మైనర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై అపోలో దవాఖానకు తరలించారు. బాలిక పరిస్థితి నిలకడగానే ఉన్నదని చెప్తున్న అధికారులు.. చెన్నైకి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలుగుదేశం మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.
నెల్లూరు నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై మేనమామ నాగరాజు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో గొంతు కోసి, యాసిడ్ దాడికి పాల్పడ్డారు. యాసిడ్‌ను బాలిక నోరు, ముఖంపై పోయడంతోపాటు కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు అక్కడికి చేరుకుని ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో చెన్నై అపోలో దవాఖానకు తరలించారు. తెలుగు మహిళా నేతలు అపోలో హాస్పిటల్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తూ నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.
జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు, నెల్లూరు కమిషనర్ హరిత, ఆర్డీఓ మలోల, డీఎస్పీ హరనాథరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో మాట్లాడి బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు అపోలోకు తరలించినట్లు గిరిధర్‌రెడ్డి తెలిపారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ సూచించారు. బాలికపై లైంగికదాడికి యత్నించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.