Srisailam | శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భద్రతా ఏర్పాట్లను నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు పరిశీలించారు. శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్స్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీరు, టాయిలెట్స్ ఇలా కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సమయమనం పాటిస్తూ ఎలాంటి తొక్కిసలాటకు తావు లేకుండా దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే మందులు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
క్యూలైన్లో ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి అప్రమతంగా ఉండాలన్నారు. ఆలయ పరిసరాల్లో బందోబస్తులో ఉన్న సిబ్బంది అధికారులు నిరంతరము అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో.. సహేతుకమైన కారణాలను మైక్‌ల ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఆయన వెంట ఆలయ ఏఈ వేణు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఉన్నారు.